సీఎం విజయ్ కు విజయ్ సేతుపతి విన్నపం
- రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాలని సీఎంకు సేతుపతి విన్నపం
- థియేటర్లలో ఆదరణ తగ్గడంతో పరిశ్రమ అనిశ్చితిని ఎదుర్కొంటోందని ఆవేదన
- సినిమా టికెట్ ధరలను పెంచే దిశగా ఆలోచన చేయాలన్న సేతుపతి
తమిళ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగులోనూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి... తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ఒక ఆసక్తికరమైన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఒక ప్రభుత్వ అధికారిక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తే చిన్న సినిమాలకు, చిత్ర పరిశ్రమకు ఎంతో ఊరట లభిస్తుందని ఆయన సీఎంను కోరారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధి ఎంతో వేగంగా జరిగిందని... ప్రస్తుతం వాటి హవా కూడా అంతే వేగంగా తగ్గిపోతోందని విజయ్ సేతుపతి అన్నారు.
మరోవైపు, థియేటర్లలోనూ సినిమాలకు ఆదరణ తగ్గడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ మనుగడ సాగించాలంటే థియేటర్లతో పాటు ఓటీటీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండటం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా మిగతా అన్ని రంగాలలో ధరలు పెరిగినందున, సినిమా టికెట్ ధరలను కూడా పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని సీఎం విజయ్‌కు సేతుపతి విజ్ఞప్తి చేశారు. సినిమా బతకాలంటే ఇలాంటి సానుకూల నిర్ణయాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు.
ఇక విజయ్ సేతుపతి సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘స్లమ్‌డాగ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.